హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల వల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం కేటాయించిన ఈ స్థలంలో అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.
సుమారు 30 ఎకరాలను అంతర్రాష్ట్ర సర్వీసులకు, 20 ఎకరాలను ఆధునిక సౌకర్యాలు కలిగిన సిటీ బస్ టెర్మినల్‌కు కేటాయించి, ఇక్కడి నుంచే నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సులను అనుసంధానించనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తూ, 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సు డిపోను, మరో 15 ఎకరాల్లో అత్యాధునిక ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రయాణం మరింత సులభతరం కావడంతో పాటు నగర రవాణా ముఖచిత్రం మారనుంది.