హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది. 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డిసెంబర్ నెల నుంచే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నగర శివారుల్లోని 30 సర్కిళ్లు, 150 వార్డుల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల రవాణా అవసరాలను గుర్తించారు. ఈ కొత్త సేవల ద్వారా ఆయా కాలనీల్లో నివసించే సుమారు 7,61,200 మంది పౌరులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ సౌకర్యార్థం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్, తదితర ఎంప్లాయిమెంట్ హబ్స్ కాలనీల నుంచి నేరుగా బస్సులను నడపనున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది.
హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న కాలనీల్లో మొదటి దశ సేవలు అందుబాటులోకి వస్తాయి. సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త కాలనీల బస్సుల రాకపోకల వివరాలను రియల్ టైమ్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 'టీజీఎస్ఆర్టీసీ గమ్యం' యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఈ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొత్తం 373 కాలనీలకు గాను హైదరాబాద్ రీజియన్‌లో 243, సికింద్రాబాద్ రీజియన్‌లో 130 కాలనీలను ఎంపిక చేశారు.