గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఏసీ బస్సుల్లో టికెట్టుపై భారీగా డిస్కౌంట్..!

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Medi Samrat
Published on : 25 March 2026 6:20 PM IST

గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఏసీ బస్సుల్లో టికెట్టుపై భారీగా డిస్కౌంట్..!

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన "పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!" అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు.పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశం. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది. బంకుల వద్ద బారులు తీరొద్దు... సేఫ్ గా బస్సెక్కండి... సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి" అని నాగిరెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్, పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

Next Story