హైదరాబాద్: మల్లాపూర్‌లోని రెండు ప్రైవేట్ ప్లాట్ల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను వెంటనే తొలగించాలని హైడ్రాను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సరైన రికార్డులు పరిశీలించకుండా, కోర్టు ముందస్తు ఉత్తర్వులను గౌరవించకుండా భూమిని "ప్రభుత్వ ఆస్తి"గా ప్రకటించి కంచె వేయడంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించడం మంచిదే అయినా, బలవంతపు చర్యలు తీసుకునే ముందు ఆధారాలను ధృవీకరించుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌లోని సర్వే నంబర్ 100లో గల రెండు ప్లాట్లు (ఒక్కొక్కటి 500 గజాలు) ప్రైవేట్ ఆస్తి అని గతంలోనే కింది కోర్టు తీర్పునిచ్చిందని, ఆ ఉత్తర్వులపై ఎలాంటి అప్పీల్ కూడా లేదని అడ్వకేట్ కమిషనర్ నివేదిక సమర్పించారు. అయినప్పటికీ అక్కడ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వెంటనే ఫెన్సింగ్ తొలగించడమే కాకుండా, పిటిషనర్లకు రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని హైడ్రాను ఆదేశించింది. ఒకవేళ వెంటనే కంచె తొలగించకపోతే, అమలు చేసే వరకు రోజుకు రూ. 1 లక్ష చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.