హైదరాబాద్ : ముసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కోసం 2వ త్రైమాసిక విడుదలగా రూ.375 కోట్లు మంజూరు చేసింది. ఈ కేటాయింపు 2025-26 సంవత్సరానికి రూ.1,500 కోట్ల బడ్జెట్ కేటాయింపులో భాగం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్లాన్ పథకం కింద ఉపయోగిస్తారు. ప్రాజెక్ట్ అమలు కోసం ఈ మొత్తాన్ని ఎంఆర్‌డీసీఎల్ పీడీ ఖాతాకు జమ చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయనున్నారు. అలాగే సుందరీకరణ, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా హైదరాబాద్‌లోని మూసీ నదిని పునరుద్ధరించడం, మార్చడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ముఖ్యమైన పనులలో పార్కులు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, వరదలను నివారించడానికి కట్టల నిర్మాణం, నదీ తీరం వెంబడి సాంస్కృతిక, వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. మూసీ నది ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే.