Hyderabad: 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను మూడేళ్లలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 3 Jan 2024 1:15 PM ISTHyderabad: 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను మూడేళ్లలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మొదటి దశలో హైదరాబాద్‌లోని 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్‌ను అధికారులు ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమాజంలోని అన్ని వర్గాల సౌకర్యార్థం అమ్యూజ్‌మెంట్ పార్క్, వాటర్‌ఫాల్స్, పిల్లలకు వాటర్ స్పోర్ట్స్, వీధి వ్యాపారులు, వ్యాపార ప్రాంతం, షాపింగ్ మాల్స్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చేపట్టే రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల డిజైన్‌లను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆకస్మిక వరదల నిర్వహణకు వర్షపు నీటిని మూసీలోకి మళ్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక కట్టడాలు - చార్మినార్, తారామతి బారాదరి, ఇతర పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను రూపొందించనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అంతకుముందు, మంగళవారం నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ సుమన్ కుమార్ బేరీతో జరిగిన సమావేశంలో, సబర్మతి రివర్‌ఫ్రంట్, నమామి గంగేతో సమానంగా రివర్ ఫ్రంట్‌ను పిపిపి మోడ్ ద్వారా అభివృద్ధి చేయడానికి సాంకేతిక సహాయాన్ని ముఖ్యమంత్రి కోరారు. మూసీ రివర్ ఫ్రంట్‌లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) ఏర్పాటుకు సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. గత ప్రభుత్వం రూ.16,600 కోట్లతో మూసీ నదికి పునరుజ్జీవనం, సుందరీకరణ చేపట్టాలని ప్రణాళిక వేసింది. చెక్ డ్యామ్‌లు, వంతెనలు నిర్మించి ఏడాది పొడవునా మూసీ నీటితో కళకళలాడేలా నదిని కొండపోచమ్మ సాగర్‌కు అనుసంధానం చేయాలని కూడా ప్రణాళిక వేసింది.