వ్యవసాయ అభివృద్ధితోనే ప్రపంచం మనుగడ ఆధారపడి ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. వ్యవసాయం ప్రస్తావన లేకుండా గతం, వర్తమానం, భవిష్యత్తు ఉండవని ఆమె చెప్పారు. కన్హ శాంతి వనంలో మూడు రోజులపాటు జరిగే వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల సమావేశానికి ఆమె హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర కోర్సులతో పోలిస్తే వ్యవసాయ కోర్సులకు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నారు.
చోళ, పల్లవ, పాండవ రాజులు, సామ్రాజ్యాలు సైతం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంప్రదాయకంగా పండే రాయల్ వరి, అస్సాం వరి, ఇటీవల అభివృద్ధి చేసిన మ్యాజిక్ వరి, పరమల్ వరి వంటి సంప్రదాయ రకాలు ఏమాత్రం రసాయనాలు లేకుండానే పండి, ఐరన్ వంటి పోషకాలు కలిగి, ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలిపారు.
ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తృణ ధాన్యాలకున్న లాభాలను రైతులకు తెలియజేయాలని చెప్పారు. ఈ విషయాలు రైతులకు, ప్రజలకు తెలియజేయాలని కోరారు. తక్కువ నీటితో, తక్కువ యాజమాన్య ఖర్చులతో అత్యధిక ఐరన్ లాంటి పోషకాలు అత్యధికంగా వీటిలో ఉంటాయని, వీటిని అందరికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యలో మెడిటేషన్, యోగకు చోటు ఇస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.