వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By - Knakam Karthik |
వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్ నగరంలోని IDPL భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సుమారు రూ.4 వేల కోట్ల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవల IDPL భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడం అది కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా, దీనికి ప్రతిగా కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేసినట్లు మాధవరం వెల్లడించారు. ఈ పరస్పర ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కాస్త జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించింది.
IDPL భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ విచారణలో ఎవరు బాధ్యులని తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరో వైపు ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. బాలానగర్ ఐడీపీఎల్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనుంది. ఇందులో భాగంగా భూమిపై హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. ఇప్పటికే ఆక్రమణలపై అప్రమత్తమైన సర్కార్..తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. భూమి రక్షణ బాధ్యతను TGIICకి అప్పగించింది.