తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. న్యూఇయర్ సందర్భంగా ఈరోజు రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది. ఉచిత రవాణా కోసం అందుబాటులో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు ఉంటాయని తెలిపింది. మందుబాబులు సొంతవాహనాలు కాకుండా తమ వాహనాల్లో ప్రయాణించి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్ వీలర్స్ సంఘం వెల్లడించింది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి సంబరాలు నిర్వహించనున్నారు. మ్యూజికల్ ఈవెంట్లకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. స్నేహితులతో కలిసి యువత సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది. బార్‌లు, పబ్‌లు, హోటళ్లు, ఫామ్ హౌస్‌లు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 వరకు సందడిగా మారనున్నాయి. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 10 గం. నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.