టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అనంతరం టీ హబ్-2 ప్రాంగణాన్ని పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని వెల్లడించారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు చెప్పారు. 2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్టార్టప్ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు. సీఎం కేసీఆర్‌తో స్టార్టప్ సంస్థల ప్రతినిధులు సెల్ఫీలు దిగారు. ఇదిలావుంటే.. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది. ఇందులో రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునే వీలుంది. టీ హబ్ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి.