హైదరాబాద్ నుంచి నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మూడు గంటల సమయం దాటినప్పటికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
మంగళవారం ఉదయం 6.20 గంటలకు హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే.. కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు ఫైలెట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా వారి ఆదేశాల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. దాదాపు 30 నిమిషాల ప్రయాణం తరువాత తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అయితే.. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటలకు పైగా మరో విమానం కోసం వేచి చూస్తున్నామని, అధికారులు సరిగ్గా స్పందించడం లేదని వారు ఆందోళన చేపట్టారు.