హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ పరిధిలోని 23 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 150 డివిజన్లకు డిసెంబర్ 1న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియ 13 రోజుల్లోనే ముగియనుంది. ఎన్నికల నగారా మోగడంతో.. రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది.
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. జనసేన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.
గ్రేటర్‌లో టీడీపీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని అన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ సంస్థలు రావడానికి చంద్రబాబు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలమధ్యనే ఉన్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఈరోజు కానీ, రేపు కానీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.