హైదరాబాద్‌లోని మెహిదీపట్నం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న "అలియా ఐస్ క్రీమ్ పార్లర్" కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. అధిక లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, హానికరమైన రసాయనాలు వాడుతూ అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న సయ్యద్ ముషారఫుద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ దాడిలో సుమారు 5,44,290 రూపాయల విలువైన 16,560 ఐస్ క్యాండీలు, 4,200 లస్సీ ప్యాకెట్లు, 150 కిలోల పెరుగు, భారీ యంత్రాలు మరియు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్ వంటి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు ఆశపడే ప్రజలే లక్ష్యంగా ఈ కలుషిత పదార్థాలను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలడంతో, నిందితుడిపై మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.