ఆపేయాలి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై 'సుప్రీం' ఆగ్రహం

కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

By Medi Samrat
Published on : 3 April 2025 4:57 PM IST

ఆపేయాలి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం

కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని చర్యలను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.

ఈ భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని కోర్టు ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు.

Next Story