ఈ రోజు నా టైం బాగుంది.. నార్సింగిలో బుల్లెట్ తాకిన‌ మ‌హిళ చెప్పిందిదే..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మ‌రోమారు బుల్లెట్ కలకలం రేపింది. ఈ నెలలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు

By Medi Samrat  Published on  30 July 2024 12:47 PM GMT
ఈ రోజు నా టైం బాగుంది.. నార్సింగిలో బుల్లెట్ తాకిన‌ మ‌హిళ చెప్పిందిదే..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మ‌రోమారు బుల్లెట్ కలకలం రేపింది. ఈ నెలలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి ఒక బుల్లెట్ దూసుకు రావడంతో ఒక మహిళకు గాయాలయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ లో నివాసం ఉంటున్న ఓ మహిళ బట్టలు ఎండేస్తున్న సమయంలో ఒక బుల్లెట్ వేగంగా ఆమె కాలుకు బ‌లంగా తాకింది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కుప్ప కూలి కింద పడిపోయింది. అది గమనించిన ఆమె కూతురు గట్టి గట్టిగా అరవడంతో సానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నార్సింగ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ ఘ‌ట‌న‌. దీంతో ఎటు నుంచి బుల్లెట్ దూసుకువస్తుందో ఏమోనని జ‌నాలు భ‌యంతో ఉన్నారు.

బుల్లెట్ గాయ‌మైన మ‌హిళ‌ పద్మ మాట్లాడుతూ.. నేను ఇంట్లో ఉన్న సమయంలో నా కాలుకు గాయమైంది. ఇంటి గుమ్మం నుండి బట్టలు ఆరవేయడానికి బయటికి వచ్చాను. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. అప్పటికే తన కాలుకు బుల్లెట్ బ‌లంగా తాకింది. కాలుకు తగిలిన బుల్లెట్ పక్కనే పడిపోయింది. వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాం. వెంటనే నార్సింగి పోలీసులు మా ఇంటికి చేరుకుని నన్ను గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయస్థితి లేదని చెప్పి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఈ రోజు నా టైం బాగుంది.. కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాను. తలకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని మహిళ వాపోయింది. తన కాలుకు తగిలిన వెంటనే అక్కడే బుల్లెట్ దొరికింది. బుల్లెట్ ఎక్కడినుండి వచ్చిందనేది నాకు తెలియదు. పెద్ద శబ్దంతో బుల్లెట్ నా కాలుకు తగిలబంతో వెంటనే బయటికి వెళ్లి చూశాను. ఆ సమయంలో బయట ఎవరూ కూడా మనుషులు లేరు. ఇంట్లో ఉన్న తనకు బుల్లెట్ తగలడంతో షాక్ కు గురయ్యాను. బుల్లెట్ ను స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారని సదరు మహిళ చెప్పారు.

Next Story