కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 డ్రా చేస్తే రూ.600 వ‌చ్చాయ్‌..!

Strange Incident at Nacharam HDFC bank ATM. సహజంగా మనం ఏటీఎం లో ఎంత డబ్బు కావాలని స్క్రీన్ పై టైప్ చేస్తామో అంతే నగదు బయటికి వస్తుంది.

By Medi Samrat
Published on : 16 July 2023 5:41 PM IST

కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 డ్రా చేస్తే రూ.600 వ‌చ్చాయ్‌..!

సహజంగా మనం ఏటీఎం లో ఎంత డబ్బు కావాలని స్క్రీన్ పై టైప్ చేస్తామో అంతే నగదు బయటికి వస్తుంది. కానీ ఓ ఏటీఎంలో వెయ్యి రూపాయలు నగదుకు బదులుగా 200 రూపాయలు వచ్చాయి. దీంతో ఆ వినియోగదారుడు ఒక్కసారి గా షాక్ గురయ్యాడు. ఇది ఒక్క వినియోగదారుడి సమస్య కాదు.. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎదురయింది. దీంతో వారంతా ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోయారు.

ఈ చిత్రమైన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏటీఎంలో చోటుచేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వద్ద ఓ బాధితుడు.. వెయ్యి రూపాయల నగదు కోసం ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతనికి వెయ్యి రూపాయలకు బదులుగా 200 రూపాయలు వచ్చాయి. అలాగే మరో బాధితుడు ఎనిమిది వేల నగదు కోసం వెళ్ళాడు. అతనికి 600 రూపాయలు వచ్చాయి.

ఈ విధంగా ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. వ‌చ్చిన వారంద‌రిది ఇదే పరిస్థితి. దీంతో ఆగ్రహానికి గురైన‌ వినియోగదారులు అక్కడ ఉన్న టెక్నీషియన్ ను అడగగా.. వినియోగదారులపై టెక్నీషియన్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వినియోగదారులు ఏటీఎం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన వెంటనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎం సెంటర్ ను మూసివేశారు.

పాపం పుట్టినరోజు కావ‌డంతో మూడు వేల రూపాయలు డ్రా చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు ఓ వ్యక్తి. కానీ చేదు అనుభవం ఎదురయింది. 3000 రూపాయలు డ్రా చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అతనికి కేవలం 600 రూపాయలు మాత్రమే వచ్చాయి. దీంతో బర్త్‌డే బాయ్‌ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పుట్టినరోజు ఎంజాయ్ చేద్దామని.. మూడు వేల రూపాయలు డ్రా చేద్దాం అనుకుంటే.. తనకు కేవలం 600 రూపాయలు వచ్చాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. క‌ష్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఆదివారం కాబట్టి కనెక్ట్ అవ్వడం లేదని.. మెయిల్ పెట్టానని.. అసలు డబ్బులు వస్తాయో లేవో అని బర్త్ డే బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు బ్రాంచ్ అధికారులు స్పందించాల్సివుంది.


Next Story