హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, కుషాయిగూడ, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, మేడ్చల్, హయత్‌నగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాన కారణంగా చాలా చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వనస్థలిపురంలో ఈదురు గాలులకు గణేశ్ దేవాలయం ప్రాంగణం, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్కు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు కాస్త పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ్‌పేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.