Hyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
By అంజి Published on 25 Dec 2024 1:15 PM ISTHyderabad: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేశారని తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారణలో తేలిన వాస్తవాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందుంచిందన్నారు.
అయితే కొందరు తప్పుదారి పట్టించేందుకు, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కేసు దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ పరువు తీసేలా చేస్తున్న అసత్య ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకుంటామన్నారు.
అమాయక మహిళ మృతి, చిన్నారి ప్రాణం తీసిన ఈ కేసును పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో దర్యాప్తు చేస్తోంది. ఎవరైనా ప్రశ్నించేందుకు తప్పుడు ప్రచారాలు, ఊహాగానాలతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ''ఈ సంఘటనకు సంబంధించి సాక్ష్యాలు లేదా అదనపు సమాచారం ఉన్న పౌరులు ఎవరైనా దానిని పోలీసు శాఖకు అందించవచ్చు. అయితే, మీ స్వంత వ్యాఖ్యలు చేయవద్దని పోలీసు శాఖ తరపున మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం'' అని పోలీసులు తెలిపారు.