అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు : ఉపరాష్ట్రపతి

Some people unable to digest India's growth. భారతదేశ అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

By Medi Samrat  Published on  2 April 2022 1:44 PM GMT
అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు : ఉపరాష్ట్రపతి

భారతదేశ అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శనివారం అన్నారు. భారత్‌కు గౌరవం, గుర్తింపు లభిస్తున్నాయని అన్నారు. కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థ‌లు చిన్న చిన్న విషయాలపై భార‌త్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయ‌న్నారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగిన తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకల్లో వెంకయ్య నాయుడు ప్రసంగించారు.

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారతదేశాన్ని గౌరవిస్తున్నారు. కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థ‌లు చిన్న సమస్యలపై భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ‌మైన‌ భారత్‌ యొక్క విలువలు, సంప్రదాయాలు, వారసత్వం ప్రతిచోటా గౌరవించబడుతున్నాయని ఆయన అన్నారు. భారతదేశ అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాల్లోని మీడియా వారు తమ దేశ ప్రయోజనాల కోసం ఏదైనా వ్రాస్తారు.. భారతదేశంలోని కొంతమంది అదే కంటెంట్‌ను ఉపయోగించి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తారని అన్నారు.

పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో కొంతమంది సభ్యుల ప్రవర్తనపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. వాడుతున్న భాష మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందన్నారు. పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో జరిగిన కొన్ని సంఘటనలు బాధాకరమని రాజ్యసభ చైర్మన్‌ నాయుడు అన్నారు. ఇలాంటి ఘటనలకు మీడియా ప్రాధాన్యమివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. శాసనసభ్యులు సమస్యలపై బాగా మాట్లాడితే అది మీడియాకు వార్త కాదని, ఎవరైనా హంగామా చేసినా, దురుసుగా మాట్లాడినా, ఇతరులపై వ్యక్తిగత దూషణలకు దిగినా అది వార్తగా మారుతుందన్నారు.

మాతృభాషలో మాట్లాడాల్సిన అవసరాన్నివెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరు తమ మాతృభాషలోనే మాట్లాడాలని, ఆ భాష అర్థం చేసుకునే వారి మధ్య ఇంట్లోనే మాట్లాడాలని, ఇతర భారతీయులతో కలిసి ఉంటే భారతీయ భాషల్లోనే మాట్లాడాలని అన్నారు. విదేశీ భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. ఏదైనా పరాయి భాష నేర్చుకోవచ్చు కానీ మాతృభాషలోనే మాట్లాడాలి.. ఇదే మన చిరునామా, గుర్తింపు అని అన్నారు. రోజువారీ జీవితంలో సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరాన్ని కూడా వెంకయ్య నాయుడు నొక్కిచెప్పారు.
















Next Story