హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచ‌ర్లు.. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో 6 చోట్ల స్నాచింగ్‌

Six chain-snatching incidents across Hyderabad.హైద‌రాబాద్ న‌గ‌రంలో చైన్ స్నాచ‌ర్స్ రెచ్చిపోయారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2023 7:28 AM GMT
హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచ‌ర్లు.. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో 6 చోట్ల స్నాచింగ్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో చైన్ స్నాచ‌ర్స్ రెచ్చిపోయారు. శ‌నివారం ఉద‌యం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో మొత్తం ఆరు ప్రాంతాల్లో మ‌హిళ‌ల మెడ‌ల్లోంచి బంగారు గొలుసుల‌ను తెంచుకుపోయారు. ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు చైన్ స్నాచ‌ర్ల‌ను ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగారు. వ‌రుస ఘ‌ట‌నల నేప‌థ్యంలో మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ల్స‌ర్ బైక్‌పై తిరుగుతూ చోరీల‌కు పాల్ప‌డ్డారు. ఇద్ద‌రు దుండ‌గులు కూడా మాస్కు ధ‌రించి ఉన్నారు. ఉద‌యం 6.20 నుంచి 8.10 గంట‌ల మ‌ధ్య న‌గ‌రంలోని ఉప్ప‌ల్ రాజ‌ధాని, క‌ళ్యాణ‌పురి, నాచారం నాగేంద్రన‌గ‌ర్‌, ఓయూలోని రవీంద్ర‌న‌గ‌ర్‌, చిల‌క‌ల‌గూడ‌లోని రామాల‌యం గుండు, రామ్‌గోపాల్ పేట్ రైల్వే స్టేష‌న్ ప్రాంతాల్లోని మ‌హిళ‌ల మెడ‌ల్లోంచి గొలుసులు దొంగిలించారు.

బాధితులు ఆయా ప‌రిధుల్లోని పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన అంత‌ర్రాష్ట ముఠా ప‌నిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రైలులో ఢిల్లీకి పారిపోయే అవ‌కాశం ఉంద‌ని అనుమానిస్తున్న పోలీసులు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద గ‌ట్టి నిఘా ఏర్పాటు చేశారు. చైన్ స్నాచ‌ర్స్ కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

చోరీలు ఇలా..

- ఉద‌యం 6:20కి ఉప్ప‌ల్‌లో

- ఉద‌యం 6:40కి ఉప్ప‌ల్‌లోనే మ‌రోచోట‌

- ఉద‌యం 7:10కి నాచారంలో

- ఉద‌యం 7:40కి ఉస్మానియా యూనివ‌ర్సిటీలో

- ఉద‌యం 8 గంట‌ల‌కు చిల‌క‌ల‌గూడ‌లో

- ఉద‌యం 8:10కి రాంగోపాల్‌పేట‌లో


Next Story