రేవంత్ రెడ్డిపై సింగిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఉప్పల్‌లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయని ఉప్పల్ నియోజకవర్గం నుంచి

By Medi Samrat  Published on  15 Oct 2023 5:32 PM IST
రేవంత్ రెడ్డిపై సింగిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఉప్పల్‌లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయని ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయ‌న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లయితే.. మా భార్య కార్పొరేటర్ గా గెలిచిందన్నారు. మా ఫ్యామిలీ ఉప్పల్ నియోజకవర్గంలో పేరున్న ఫ్యామిలీ అని.. గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశాన‌ని వెల్ల‌డించారు. పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరు.. నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని.. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్న.. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు.. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని వాపోయారు.

పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని.. BRS అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని సింగిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక డివిజన్ కి కూడా తెల్వని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడని అన్నారు. సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడని.. ఉత్తమ్ కి సీఎం పదవి వస్తే తనకు నష్టమని రేవంత్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమం ఎక్కడున్న నేను ముందుట.. రేవంత్ కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని అన్నారు. కొడంగల్‌లో తంతే మల్కాజిగిరిలో మేము గెలిపించుకున్నాం.. రేవంత్ కి అహంకారం వచ్చిందని అన్నారు. రేవంత్ బాధితులు అంత నాతో రండి.. అందరి తరుపున నేను కొట్లాడ్తా అని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో రేవంత్ ఓటమికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా.. 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారు.. మాతో వందల కోట్లు ఖర్చు చేపించిండు.. ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేసిన నేను.. రేపటి నుంచి రేవంత్ కు వ్యతిరేకంగా పని చేస్తాన‌ని శ‌ప‌థం చేశారు.

రేవంత్ రెడ్డికు హటావో.. కాంగ్రెస్ కు బచావో పేరుతో అన్ని నియోజకవర్గాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తిరుగుతా.. రేవంత్ ని ఓడగొడుతాన‌ని అన్నారు. నా నియోజకవర్గంకు పోవాలంటే సిగ్గు అవుతుంది.. 15రోజుల నుంచి ఢిల్లీలో దాకున్నాన‌న్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెడితే బీఆర్ఎస్‌ని ఎలా ఎదిరిస్తారని ప్ర‌శ్నించారు. ఉప్పల్‌లో పార్టీ ఖాళీ అవుతుంది.. నాకు.. నా ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

Next Story