మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన

పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది.

By అంజి
Published on : 2 July 2025 2:03 PM IST

Sigachi Factory, compensation, 1 crore, Pasamailaram, Hyderabad

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన

హైదరాబాద్‌: పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది. 33 మందికి గాయపడినట్టు కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్‌ పేరిట ప్రకటన విడుదల చచేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి అన్ని విధాలుగా మద్ధతు అందిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అన్ని బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని చెప్పింది. అటు ఈ ప్రమాదానికి రియాక్టర్‌ పేలుడు కారణం కాదని, ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని నివేదిక కోసం ఎదురుచూస్తున్నామంది. మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు మూసివేస్తున్నామని ప్రకటించింది.

అటు సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇంకా 11 మంది ఆచూకీ దొరకలేదని ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మరణించారని, గల్లంతైన వారు బతికే అవకాశాలు తక్కువేనని చెప్పారు. 18 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. సిగాచీ కంపెనీ యాజమాన్యంతో చర్చించినట్టు పేర్కొన్నారు. ప్రమాదస్థలిని ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ పరిశీలించారు.

సిగాచీ కంపెనీపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిగాచి కంపెనీ ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు పై భానూరు పోలీసుల కేసు నమోదు చేశారు. ''అగ్ని ప్రమాదం జరిగిన రోజు 9:30 ప్రాంతంలో ఒకసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో కంపెనీలో 145 మంది పని చేస్తున్నాం..పేలుడు దాటిలో కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన కొందరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించాము. చాలామంది మంట ల్లో కాలిపోతూ కనిపించారు. సిగాచి కంపెనీలో కనీస సదుపాయాలు లేవు. మంటలను ఆర్పేందుకు కనీసం గా ఫైర్ సిలిండర్స్ కూడా లేవు. కంపెనీ లో ఉన్న మిషనరీ మొత్తం కూడా చాలా పాతది. మిషనరీ మొత్తాన్ని మార్చాలని పదేపదే మేనేజ్మెంట్ కి చెప్పాము. పాత మిషనరీ మీదనే పనిచేయాలని మాపైన మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చింది. చెడిపోయిన పాత మిషనరీ మీదనే మా చేత బలవంతంగా పనిచేయిం చారు‌. పలుమార్లు మిషనరీలో సమస్యలు తలెత్తుతున్న వాటిని మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. కంపెనీలో భారీ పేలుడుకి పాత మిషనరీ కారణం'' అని యశ్వంత్ అన్నాడు. కంపెనీలో ఇంత మంది చనిపోవడానికి మేనేజ్మెంట్ కారణమని యశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడిన కంపెనీ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story