మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై ప్రమోద్ గౌడ్, ఆర్ఎస్సై జతావత్ బాబు నాయక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక సైబర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా, కేవలం బీఎన్ఎస్ఎస్ 35 (గతంలో 41ఏ సీఆర్‌పీసీ) కింద నోటీసులు ఇచ్చి వదిలేయడానికి ఈ ఇద్దరు అధికారులు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహం రచించారు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలో డబ్బులు ఇచ్చేందుకు బాధితులు అంగీకరించారు. ఆర్ఎస్సై నాయక్ అక్కడికి చేరుకుని లంచం తీసుకుంటుండగా, అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఎస్సై ప్రమోద్ గౌడ్ ప్రోద్బలంతోనే ఈ లంచం తీసుకున్నట్లు నిర్ధారించిన అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు వెల్లడించారు.