కిట్టి పార్టీలతో ప్రముఖులకు రూ.కోట్లలో కుచ్చుటోపీ.. శిల్పా చౌదరి అరెస్ట్‌.!

Shilpa Chaudhary is lying and easily cheating crorepatis by collecting crores of rupees. మహా కిలాడీ శిల్పా చౌదరి. తన మాయ మాటలతో ప్రముఖులను మోసం చేసింది. పార్టీల పేరుతో కోటీశ్వరులతో పరిచయాలు పెంచుకుని అందరినీ చీట్‌ చేస్తోంది.

By అంజి  Published on  27 Nov 2021 7:15 AM GMT
కిట్టి పార్టీలతో ప్రముఖులకు రూ.కోట్లలో కుచ్చుటోపీ.. శిల్పా చౌదరి అరెస్ట్‌.!

మహా కిలాడీ శిల్పా చౌదరి. తన మాయ మాటలతో ప్రముఖులను మోసం చేసింది. పార్టీల పేరుతో కోటీశ్వరులతో పరిచయాలు పెంచుకుని అందరినీ చీట్‌ చేస్తోంది. వారి నుంచి కోట్లలో డబ్బులు గుంజి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి వ్యాపారవేత్త శిల్పా చౌదరి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ నార్సింగి పోలీసులు శిల్పాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శిల్పా చౌదరి నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాలో నివాసం ఉంటోంది. ఆమె గత కొన్నాళ్లుగా పుప్పాలగూడ, మణికొండ, కోకాపేట, గండిపేట, విజయవాడ, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది.

అక్కడికి వచ్చిన వారితో పరిచయాలు పెంచుకునేది. తాను సినీ పరిశ్రమలో ఒక నిర్మాతను అంటూ నమ్మించి వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర కోటి నుండి ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత వారి నుండి తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే రోహిణి అనే మహిళా బాధితురాలు తాను రూ.4 కోట్లు శిల్పా చౌదరికి ఇచ్చి మోసపోయానని తెలుసుకుంది. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు తెలిపింది. శిల్పా చౌదరి చాలా మంది దగ్గర రూ.100 కోట్ల పై చిలుకు డబ్బులు తీసుకున్నట్లు బాధితురాలు రోహిణి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్నేచర్‌ అపార్ట్‌మెంట్‌లో శిల్పాను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story