గుర్తింపు లేని నిర్భాగ్యులు : శాంతిన‌గ‌ర్ బ‌స్తీ వాసులు

Shanthi Nagar Slums. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం వర్ణణాతీతం. కరోనా కాటుకు మరణించిన వారి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2021 6:31 AM GMT
గుర్తింపు లేని నిర్భాగ్యులు : శాంతిన‌గ‌ర్ బ‌స్తీ వాసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన అల్లకల్లోలం వర్ణణాతీతం. కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య లెక్కకు అందనిది. ఒక్కసారిగా వచ్చి మీద పడిన ఈ విపత్తులో ప్రజలు తమ ఆప్తులను కోల్పోయి, ఒంటరిగా మారారు. దీంతో వారి జీవితాల్లో ఆనందాలను కోల్పోయి, ఆశ నిరాశల మద్య కాలం వెల్లదీస్తున్నారు.

ఏ దేశంలో చూసినా శవాల కుప్పల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇక పేద దేశాల పరిస్థితి మరింత దారుణం. కోవిడ్ కోరలు చాచిన వేళ, ఆకలి చావులు తోడయ్యాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో, రోజు పనిచేస్తే కానీ పూటగడవని స్థితిలో ఉన్న ప్రజలను కరోనా సమస్య మరింత పేదరికంలోకి నెట్టింది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో ప్రజల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

బతుకు దెరువు కోసం, పొట్టచేతపట్టుకొని వలసొచ్చిన కార్మికులు, పనిలేక, పస్తులుండలేక, సొంతూళ్లకు వెళ్లలేక అనేక ఇబ్బందులు పడ్డారు. తమది కాని చోట, కష్టాలు, కన్నీళ్లతో సహచర్యం చేస్తూ, రహదారుల వెంట, రైలు పట్టాల వెంట వందల కిలోమీటర్ల దూరంలోని స్వస్థలాలకు పయనమయ్యారు. ఆ దారిలో ఎండకు ఎండి, వానకి తడిసి, అలసి సొలసి ఇంకెంతో మంది ప్రాణాలను వదిలారు.

తెలుగు రాష్ట్రాల పాలకులు, తమ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా భావించే నగరం హైదరాబాద్. ఒకవైపు అంతెత్తు ఆకాశ హార్మాల్లోని అపర కుబేరులు, మరోవైపు మురికి వాడల్లోని పూరి గుడిసెల్లో నివసించే కడు పేదరికపు జాడలు. అలాంటి హైదరాబాద్ మహా నగరంలో, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు ఆనుకుని వున్న బస్తీ శాంతి నగర్.

శాంతి నగర్ బస్తీలో దాదాపు మూడు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడ వున్న వాళ్ళందరూ వివిధ రాష్ట్రాల నుండి, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పొట్టచేత పట్టుకొని వచ్చిన వలస కార్మిక కుటుంబాలే. పక్కా ఇళ్లు లేక, రోడ్డు సౌకర్యం లేక, కనీస వసతులు లేక దినదిన గండంగా బతుకుతున్న పేదరికం వాళ్లది. అక్కడ నివసించే మరో ముప్పై ఆరు కుటుంబాల పరిస్థితి మరింత దారుణం. వీరు పూరి గుడిసెలపై కవర్లు కప్పి, కాలం వెల్లదీస్తున్నారు. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వీళ్లు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకొని, ఇళ్లల్లో పనిమనిషులుగా పనిచేస్తూ రోజుకు రెండు-మూడొందలు సంపాదిస్తూ, కుటుంబాలను భారంగా పోషిస్తున్నారు. దానికి తోడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే దుర్వాసనను ఊపిరిగా పీలుస్తూ, భయంకరమైన రోగాల బారిన పడుతూ, రోజువారీ జీవితాన్ని అత్యంత దుర్భరంగా కొనసాగిస్తున్నారు.

తమ కాయకష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న శాంతి నగర్ వాసులు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్నప్పటికీ అనేక ప్రభుత్వ పథకాలకు దూరంగా వున్నారు. తెలంగాణ రాష్ట్రమంతా, మిషన్ భగీరథ ద్వారా చాలా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మంచి నీటి సౌకర్యం వున్నా, హైదరాబాద్ మహానగరపు శాంతి నగర్ మురికి వాడలో మాత్రం, గొంతు తడపడానికి వారం రోజుల పాటు ఆగాల్సిందే.

ఇక ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు, ఈ ప్రాంతంలో ఉన్న ముప్పై ఆరు పూరి గుడిసెల్లో ఇద్దరు, ముగ్గురికే అందుతున్నాయి . మిగతా వాళ్ళకి కనీసం రేషన్ కార్డులు లేని పరిస్థితి. చాలా సందర్భాల్లో ఎవరో ఒకరు రావడం, వాళ్ల వివరాలు నమోదు చేసుకోవడం మినహా, గత ఇరవై సంవత్సరాలుగా రేషన్ కార్డులు జారీ అయిన సందర్భాలు లేవు. దీంతో అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తూ కాలం వెల్లదీస్తున్నాయి.

ఇలాంటి దారుణ పరిస్థితుల్లో బతుకుతున్న శాంతి నగర్ మురికి వాడల్లోని ప్రజలకు, కరోనా వేళ విధించిన లాక్ డౌన్ వారి జీవితాలను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసింది. వీళ్లకు కరోనా రాకపోయినా, వీరి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కరోనా వాహకులుగా సమాజంలో వివక్షను ఎదుర్కొన్నారు. ఒక్కసారి అక్కడి వాళ్లను పలకరిస్తే, కరోనా వేళ విధించిన లాక్డౌన్ కష్టాలను ఎదురీదుతున్న తీరు, సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.

60 సం. పైబడిన లక్షమ్మ తన భర్తను కోల్పోయి 14 సం. లు గడిచింది. తన భర్త చనిపోవడంతో తనకు కుటుంబ పోషణ కష్టమై తనకు వితంతు పింఛను ఇవ్వమని అడిగితే, తన భర్త చనిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకునిరా అని అంటున్నారని, లేని సర్టిఫికెట్లను తాను ఎలా తీసుకురాగలనని బాధపడ్డారు. ఇదే విషయమై తమ కార్పొరేటర్ ని అడిగితే ఆమె ఒక్కదానికి అతను సర్టిఫికెట్ ఎలా చేపించాలని అంటున్నాడని వాపోయారు. 40 సం. ల అనిత భర్త కూడా చనిపోయి 7 సం. లు అవుతుంది. వారిద్దరి భర్తలు చనిపోయాక వారి భర్తలు చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి కొందరు స్మశానం దగ్గర వారితోటి డబ్బులు తీసుకుని కూడా వారికి ఎవరూ ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని తలుచుకుని కుమిలిపోయారు. వీళ్లిద్దరికీ రావాల్సివున్న ఆసరా పింఛన్ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దాని ఊసే లేదు.

అదే బస్తీ లో వున్న అర్చనకు ఇద్దరు చిన్నపిల్లలు. ఆమె రేషన్ కార్డ్ కొరకు అప్లై చేసుకునేందుకు గత ఏడాది నుండి ప్రయత్నిస్తున్నప్పటికి కరోనా లాక్డౌన్ కారణం చూపి ఎవ్వరూ కూడా తనకు రేషన్ కార్డ్ మంజూరు చెయ్యట్లేదని బాధపడ్డారు. వారికి రోజుకు రెండు మూడు వందల రూపాయలు వస్తే అందులో బియ్యం, కూరగాయలు మరియు ఇతరా వస్తువులకే అవి సరిపోవట్లేదని వ్యక్తపరిచారు. ప్రభుత్వ పాఠశాల దూరంగా ఉండడం వల్ల చిన్న పిల్లల్ని బడికి దూరం పంపలేక, నాలుగు వేల రూపాయలు కట్టి దగ్గర్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ కి పంపలేక, పొట్టకూటి కోసం తన పిల్లల్ని కూడా తనతోపాటు పనికి తీసుకెళ్తున్నారు. ఎన్నో తరాల నుండి తమలాంటి వారు విద్యకు దూరమయ్యారని, ప్రస్తుతం ఆమె పిల్లల పరిస్థితి కూడా అదే అని తన గోడును వెళ్లబుచ్చుకున్నారు.

దుర్గమ్మ అనే పెద్ద మనిషికి రేషన్ కార్డు లేకపోవడంతో, కంట్రోల్ బియ్యం కూడా లేక ఆ బస్తీకి ఎవరైనా దాతలు సహాయం చేయడానికి వస్తారని చెట్టు కింద చాప వేసుకుని ఎదురుచూసేవారని, ఏదైనా కార్ రాగానే ఏమైనా సహాయం చేస్తారేమో అనే ఆశతో కార్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారని, ఒకవేళ వారు ఏమైనా ఇస్తే, వారిచ్చిన కూరగాయలు, ఆహార పదార్థాలే వండుకొని తినేవారని బాధపడ్డారు. వారికి రేషన్ కార్డులు లేక, మరోవైపు ఉపాధి కోల్పోయి, ఎవరైనా దానం చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు లాకడౌన్ కాలాన్ని నెట్టుకొచ్చారు. ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దానికి ఈ నిద్రపోతున్న వ్యవస్థనే కారణమని తమ గోడును వెలిబుచ్చారు.

లాక్డౌన్ లో వారికి పనులు దొరకక, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన సదుపాయాలు సమయానికి అందక వారి జీవితం మరింత దుర్భరంగా తయారయ్యింది. రాంకీ కంపెనీ అక్కడ స్థాపించకముందు అక్కడ వారే స్వయంగా చెత్తను సేకరించేవాళ్ళని, కానీ రాంకీ కంపెనీ వచ్చిన తరువాత భద్రత పేరు మీద అక్కడి యజమానుల అనుమతి తీసుకొని వారు చెత్తను సేకరించాల్సివస్తుందని, పైగా కరోనా నెపంతో రాంకీ కంపెనీ వారు వారికి చెత్త ఏరుకునేందుకు అనుమతి నిరాకరించడంతో వారి బతుకుదెరువు పైన పెద్ద దెబ్బ పడిందని వాపోయారు. ఇప్పటివరకు వారికి ఆ కంపెనీ నుండి ఎటువంటి సహాయసహకారాలు అందలేదని బాధపడ్డారు. వారు పని చేసే దగ్గర ఎక్కడైనా మంచి నీళ్ళు తాగుదామని వెళ్లినా కరోనా పేరుతోటి దూరం పెడుతూ, చులకనగా చూస్తూ, వివక్షకు గురి చేస్తున్నారని విచారించారు.

చెత్త సేకరించేటప్పుడు వారికి స్థోమత లేక వారు ఎటువంటి గ్లౌజులు, మాస్కులు ధరించకుండా వట్టి చేతుల్తోనే చెత్తను సేకరించేవారు. అలా చెయ్యడం వల్ల వారికి కరోనా బారిన పడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని భయపడ్డారు. ఇంతవరకు వారికి ఎవ్వరికీ కరోనా సోకలేదని, ఒకవేళ పోరపాటున సోకితే గనుక ఇక వారిని పట్టించుకునేవారే ఎవ్వరూ లేరని తమ ఆవేదనని వ్యక్తం చేశారు.

వారు ఎప్పుడైనా అనారోగ్యం పాలైనప్పుడు కొన్నిసార్లు బాలాజీ నగర్ పి.హెచ్.సి కి వెళ్తారని, లేదా దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులిచ్చి చూపించుకుంటారని చెప్పారు. మరీ తీవ్ర అనారోగ్యంతో వారు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా డెంటల్ కాలేజ్ దాకా ఆర్.టి.సి. బస్ కొరకు వెళ్ళాల్సివస్తుందని, ఆ సౌకర్యం కూడా లేకపోతే వారు చాలా సార్లు జీహెచ్ఎంసీ చెత్త బండ్లలో ఎక్కి ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రి ఎదుట దిగి అక్కడే వైద్యం చేయించుకుంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ బండి డ్రైవర్లు వారికి తెలిసిన వారు కాబట్టి వారి నుండి ప్రయాణ చార్జీలు ఏమీ తీసుకోరని, ఆసుపత్రికి వెళ్లేందుకు వారి దగ్గర బస్ చార్జీలకు కూడా డబ్బులు లేకపోవడం వల్ల వారు ఇలా చెత్త బండిలో వెళ్ళాల్సివస్తుందని వాపోయారు.

అదే బస్తీలో నివసిస్తున్న యాదమ్మది మరో గాథ. యాదమ్మ పుట్టకముందే తన తల్లిదండ్రులు శాంతి నగర్ కు వలస వచ్చారు. ఆమె ఇక్కడే పుట్టి పెరిగి, స్థిరపడ్డారు. అక్కడ వారికి వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తాయని, మిగతా రోజుల్లో వారు 50 రూపాయలకు ఒక డ్రమ్ లాగా నీరు కొనాల్సిందేనని, కాలంతో సంబంధం లేకుండా వారికి ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. ఇక్కడ వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, లాక్ డౌన్ సమయంలో తినడానికి మరియు వైద్యం కొరకు వారు అప్పులు చేసి వాటిని కట్టుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తన పెద్ద కూతురికి చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తడంతో, గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన యాదమ్మ, రెండు రోజుల్లోనే శవమై వచ్చిన కూతురిని తలుచుకొని కన్నీటి పర్యంతమై, తన కూతురు చావుకు కారణం ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యమేనని వాపోయింది. కరోనా వల్ల ఆమె, తన భర్త ఇద్దరూ ఉపాధి కోల్పోయారని, ఆ తరువాత వారికి తెలిసిన ఒక కాంట్రాక్టర్ ద్వారా వారికి కొంత పని దొరికిందని, కుటుంబ పోషణ భారమై తమ పిల్లలని కూడా చదువు మాన్పించి పనికి తీసుకెళ్లాల్సిన దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందని కన్నీరు-మున్నీరయ్యారు.

పొట్టకూటి కోసం అనుదినం చెత్తను ఏరుకుంటూ బతుకుతున్న వారు ప్రభుత్వ లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఎవర్ని ఆశ్రయించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఎన్నో ఏళ్ళుగా సమాజంలో వారికంటూ ఏ ఆధారాలు మరియు గుర్తింపు లేక అనామకులుగా బతుకుతున్నామనే భావనతో వారు జీవితం మీద విరక్తి చెందారు. ప్రభుత్వం చేత సరైన గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల సామాజికంగా వారి గుర్తులు చెరిపివేయబడి, ప్రభుత్వం నుండి పొందవలసిన ఎన్నో పథకాలను పొందలేక వారు నానా అవస్థలు పడుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ఏ ఆధారాలు లేని నిరాధార జీవులని ఆధారాలు తీసుకురమ్మంటే ఎక్కడి నుండి తీసుకురాగలరు? ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా అలా విగత జీవులుగా వారిని వదిలేయడం ముమ్మాటికీ వ్యవస్థీకృత వైఫల్యమే.

సరిగా కూడు, గూడు, గుడ్డ లేక బతుకుతున్న ఈ దిక్కు మొక్కు లేని ఆ విశ్వనగర బస్తీవాసులకు ప్రభుత్వం చొరవ తీసుకొని సామాజిక భద్రత కల్పించాలి. ప్రభుత్వం నుండి అందవలసిన మౌలిక వసతులు ఆ ప్రజలకు కూడా అందాలంటే, వారికి ప్రభుత్వం తక్షణమే గుర్తింపు కార్డులు అందజేయాలి. అలాగే వారు సురక్షితంగా పనులు చేసుకునే దిశగా ప్రభుత్వం వారికి ప్రత్యామ్న్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇటువంటి మరెంతో మంది దీనుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారకుండ ప్రభుత్వ యంత్రాంగాన్నీ పటిష్టం చేయాలి.


Next Story