మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకున్నా లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. మహిళలు పొడవాటి దుస్తులు వేసుకున్నా.. పొట్టి దుస్తులు ధరించినా సరే స్త్రీలను పురుషులు అదో రకంగా చూడడం మానడం లేదని తెలుస్తోంది. మహిళలు ఆబ్జెక్టిఫికేషన్‌కు లోనవుతున్నారని ఐఐఐటీ హైదరాబాద్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) కాగ్నిటివ్ సైన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ద్వారా ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చారు. స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించినా కూడా ఈ వేధింపులు ఆగవని.. వారి వస్త్రధారణ గురించి మాటలు పడాల్సిందే అని తెలుస్తోంది.
ఐఐఐటి-హెచ్‌లోని కాగ్నిటివ్ సైన్స్ ల్యాబ్ కు చెందిన ప్రొఫెసర్ కవితా వేమూరి మార్గదర్శకత్వంలో ఆయుషి అగర్వాల్, శ్రీజా భూపతిరాజు రాసిన “Objectifying Gaze: An Empirical Study With Non-Sexualized Images,” అనే పేపర్ ఐ-ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి విజువల్ గాజ్ ప్యాటర్న్‌లను పరిశీలించింది. మహిళల దుస్తులతో సంబంధం లేకుండా.. బహిరంగంగా ఎక్కడ ఉన్నా కూడా అనుచిత చూపులను ఎదుర్కొంటారని ప్రొఫెసర్ వేమూరి అన్నారు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన అధ్యయనాలలో శరీర భాగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని, భారతదేశంలో ముఖాన్ని కూడా చూస్తున్నారని ప్రొఫెసర్ వేమూరి కవిత వివరించారు.