హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో బ్రాండెడ్ షోరూమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కొంటే చాలా ఖర్చు అయిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అదే బ్రాండ్ కు చెందిన బట్టలు, వస్తువులు అతి తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. వాటిని రకరకాల మాటలు చెప్పి అమ్మేస్తూ ఉంటారు. తాజాగా కొత్తపేటలోని తన దుకాణంలో డూప్లికేట్ అలెన్ సోలీ, లూయిస్ ఫిలిప్ అపెరల్స్ విక్రయిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కోటి విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి 2.24 లక్షలు నగదును సీజ్ చేశారు.
పక్కా సమాచారంతో రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎల్‌బీనగర్) కొత్తపేటలోని ఆర్‌బీఐ కాలనీలో ఉన్న విజయ గార్మెంట్స్‌పై దాడి చేసి సత్యపాల్‌రెడ్డి వినియోగదారులకు అలెన్ సోలీ, లూయిస్ ఫిలిప్ బ్రాండ్‌లకు చెందిన డూప్లికేట్ టీషర్టులు, షర్టులు, జీన్స్, కాటన్ ప్యాంట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. "అతను కొంతమంది వ్యక్తుల నుండి తక్కువ ధరకు దుస్తులను పొందాడు. వాటిని కంపెనీ ఒరిజినల్ వస్తువులు అని పేర్కొంటూ వినియోగదారులకు విక్రయించాడు. అందుకు సంబంధించిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని SOT అధికారులు తెలిపారు. అతడిని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదైంది.