సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మరింత భారం మోపుతున్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30లకు పెంచేశారు. దేశ వ్యాప్తంగా రూ.10 ఉన్న ధరను ఆయా స్టేషన్‌లలో రూ.30 వరకు పెంచుకునేందుకు రైల్వే శాఖ అవకాశం ఇచ్చింది. ఇదే అవకాశం భావించిన సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచేసింది. అదే నాంపల్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.20కి పెంచారు. కాచిగూడ, మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో రూ..10 వసూలు చేస్తున్నారు. కరోనాకు ముందు హైదరాబాద్‌లోని మూడు రైల్వే స్టేషన్‌లలో ప్రతి రోజు దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టికెట్లు విక్రయం అయ్యేవి. తాజాగా పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రైల్వే అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ప్రకటించకుండానే సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లలో సోమవారం నుంచి పెరిగిన ప్లాట్‌ఫాం ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే కరోనా కారణంగా రద్దీని తగ్గించేందుకు మాత్రమే ఈ ప్లాట్‌ఫాం ధరలను పెంచినట్లు రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు. కానీ కరోనా తగ్గిన తర్వాత ధరలను తగ్గిస్తారా..? అంటే ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కసారిగా ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంచడంపై ప్రయాణికులు రైల్వే అధికారులపై మండిపడుతున్నారు. 10 రూపాయలు ఉన్న టికెట్ ధర ఏకంగా రూ.30 పెంచడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.