సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సాయన్న మూడు రోజుల క్రితం ఛాతీ నొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఆయన పరిస్థితి క్షీణించిందని, గుండె ఆగిపోవడంతో ఆకస్మిక మరణానికి దారితీసిందని చెబుతున్నారు.
సాయన్న తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. 1994, 1999, 2004 వరకు జరిగిన మూడు వరుస ఎన్నికల్లో, పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర్‌రావు చేతిలో ఓడిపోయారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2014లో మళ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2018 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుసార్లు హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. సాయన్న మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.