హైదరాబాద్ జూలో.. 15 పులులను దత్తత తీసుకున్న ఎస్‌బీఐ

SBI adopts 15 tigers at Hyderabad Zoo. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న 15 పులులను ఒక సంవత్సరం పాటు

By అంజి  Published on  22 Feb 2022 7:15 AM GMT
హైదరాబాద్ జూలో.. 15 పులులను దత్తత తీసుకున్న ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న 15 పులులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. హైదరాబాద్ సర్కిల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ ఝింగ్‌రాన్ సోమవారం తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆర్.శోభకు దత్తత చార్జీల నిమిత్తం రూ.15 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తగా పునర్నిర్మించిన ఏషియాటిక్ లయన్స్ ఎన్‌క్లోజర్‌లో ఒక జత ఏషియాటిక్ సింహాలను ప్రజల ప్రదర్శనకు విడుదల చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 14 స్వచ్ఛమైన ఆసియా సింహాలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం జూ పార్కు చుట్టూ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు.

వన్యప్రాణుల సంరక్షణలో ఎస్‌బీఐ కీలకపాత్ర పోషిస్తోందని, ఇందులో భాగంగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 2011 నుంచి ప్రతి ఏటా 15 పులులను ఎస్‌బీఐ దత్తత తీసుకుంటోందని జింగ్రాన్ తెలిపారు. పులులు, జంతుప్రదర్శనశాలల నిర్వహణపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, మంచి పరిశుభ్రతతో పాటు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పులులను దత్తత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పులులను పెంచుతున్న జూ యాజమాన్యాన్ని, తెలంగాణ అటవీ శాఖను ఆయన అభినందించారు.

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వరుసగా 10వ సంవత్సరం 15 పులులను దత్తత తీసుకోవడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ పట్ల గొప్ప సంజ్ఞను ప్రదర్శించినందుకు శోభా జింగ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, హైదరాబాద్‌ సర్కిల్‌, హైదరాబాద్‌లోని జూ పార్క్స్‌ డైరెక్టర్‌, నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ ఎం.జె.అక్బర్‌, క్యూరేటర్‌ ఎస్‌.రాజశేఖర్‌, డిప్యూటీ క్యూరేటర్‌ ఎ.నాగమణి, ఇతర జూ అధికారులు పాల్గొన్నారు.

Next Story