Savecityforest: గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని రూ.10,000 కోట్లకు వేలం వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రణాళికలు రచిస్తూ ఉండడంతో సైబరాబాద్ నివాసితులు సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 March 2025 1:43 PM IST
Savecityforest,Hillridge, Hyderabad, Telangana govt, Gachibowli

Savecityforest: గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని 10,000 కోట్లకు వేలం వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రణాళికలు రచిస్తూ ఉండడంతో సైబరాబాద్ నివాసితులు సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.

హిల్‌రిడ్జ్, ఐఎస్‌బి మధ్య ఉన్న 400 ఎకరాల గచ్చిబౌలిలోని ప్రాంతాన్ని 10,000 కోట్లకు అమ్ముతున్నారు. ఈ భూమి కెబిఆర్ పార్క్ కంటే నాలుగు రెట్లు పెద్దది. నగరానికి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే ప్రాంతం. ఈ స్థలంలో ఎన్నో పక్షులు, జంతువులకు నిలయం. క్యాంపస్‌లో దాదాపు 237 జాతుల పక్షులు ఉన్నాయి. మచ్చల జింకలు, అడవి పందులు, స్టార్ తాబేళ్లు, పాములు, ఇండియన్ రాక్ పైథాన్, వైపర్స్, కోబ్రాస్, బోయాస్, క్రైట్స్ మొదలైన జంతుజాలం ఉన్న పట్టణ అటవీ ప్రాంతాలలో ఇది ఒకటి.

హైదరాబాద్‌లో మిగిలి ఉన్న కొన్ని పట్టణ అడవులలో కంచ గచ్చిబౌలి ప్రాంతం ఒకటి. దీనిని నాశనం చేయడం వల్ల ఇతర పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలకు ప్రమాదకరంగా నిలుస్తుంది.

జంతువులు ఎక్కడికి వెళ్తాయి? వాటి తరపున ఎవరు మాట్లాడతారు?

హైదరాబాద్‌కు చెందిన సేవ్‌సిటీఫారెస్ట్ అనే సమూహం భూమి, అక్కడి జంతువులను కాపాడటానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. భూమిని కాపాడటానికి న్యాయవాదులు, పర్యావరణవేత్తలతో కలిసి పనిచేయడానికి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

సమస్య ఏమిటి?

సేవ్‌సిటీఫారెస్ట్ సభ్యురాలు యు.శివాని మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSIIC) హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ భూమి అంచనా విలువ 10,000 కోట్లు, వేలం ప్రక్రియ మార్చి 8 నుండి 15, 2025 వరకు జరుగుతుంది.

ప్రభుత్వం దీనిని ఆదాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి చొరవగా పేర్కొన్నప్పటికీ, ఈ భూమి పర్యావరణ ప్రాముఖ్యత గురించి మాట్లాడడం లేదు.

ఈ ప్రాంతం బంజరు భూమి కాదు. గొప్ప, జీవవైవిధ్య అటవీ ఆవాసం. ఇది మచ్చల జింకలు, ముళ్లపందులు, భారతీయ ముంగూస్, అడవి పందులు, మానిటర్ లిజార్డ్స్ వంటి బహుళ అడవి జాతులకు కూడా నిలయం. ప్రతిపాదిత ప్రాంతంలో పీకాక్ సరస్సు, బఫెలో సరస్సు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో వలస పక్షులను స్వాగతిస్తాయి. ప్రతిపాదిత వేలం పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణులకు ఇబ్బందులు, హైదరాబాద్‌కు వాతావరణ సమస్యల గురించి తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తుంది.

వేలం కోసం ప్రభుత్వ ప్రణాళిక:

ఈ భూమికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్థిరమైన మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయడానికి TSIIC కన్సల్టెంట్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా:

వాణిజ్య, నివాస ప్రాంతాల అభివృద్ధి

పబ్లిక్ పార్కులు, సౌకర్యాలు

నడక మార్గాలు, సైక్లింగ్ ట్రైల్స్, గ్రీన్ స్పేస్‌లు

వారసత్వ, సంస్కృతి ఆధారిత పర్యావరణ ఉద్యానవనాలు

రియల్ ఎస్టేట్‌లో కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉన్న కన్సల్టెంట్లు భూమి సాంకేతిక, ఆర్థిక అంశాలను అంచనా వేస్తారు, ఆ తర్వాత దానిని దశలవారీగా వేలం వేస్తారు. ప్రణాళిక ప్రక్రియ ఆరు వారాల్లోపు పూర్తవుతుందని భావిస్తున్నారు, ఆ తర్వాత వేలం కొనసాగుతుంది.

హిల్‌రిడ్జ్ నివాసి అయిన సేవ్‌సిటీఫారెస్ట్ సభ్యుడు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ "ఆశ్చర్యకరంగా, ప్రభుత్వం ఎప్పుడూ అడవి గురించి ప్రస్తావించలేదు. మేము అటవీ అధికారులను సంప్రదించాము, కానీ అది అటవీ భూమి కానందున వారు సహాయం చేయలేకపోతున్నారు. ఇంకా, మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి పిటిషన్ దాఖలు చేస్తున్నాము." అని తెలిపారు.

"హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం మధ్య ఎటువంటి భూ వివాదం లేదు. కోర్టు ఆదేశాల ప్రకారం, భూమి ప్రభుత్వానికి చెందినది, వారు తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు" అని యుఓహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్‌ అన్నారు.

దాచిన వాస్తవాలు:

కంచ గచ్చిబౌలి ఒక గొప్ప పర్యావరణ ప్రాంతం

హిల్‌రిడ్జ్, ఐఎస్‌బి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఓహెచ్) మధ్య ఉన్న ఈ 400 ఎకరాల భూమి, అధిక జీవవైవిధ్యం కలిగిన గొప్ప అటవీ పర్యావరణ వ్యవస్థ.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి `వైల్డ్‌లెన్స్' గతంలో ఫోటోలు, వీడియోల ద్వారా ఈ ప్రాంతంలోని వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలం సమాచారాన్ని నమోదు చేసింది. వారి అంచనా ప్రకారం, ఈ ఆవాసం విస్తృత శ్రేణి పక్షులు, జంతువులకు నిలయంగా ఉంది. సుమారు 237 రకాల పక్షులు ఉన్నాయి. విశ్వవిద్యాలయంలో మంచి సంఖ్యలో మూలికలు, ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.

వీటిలో, భారతీయ నక్షత్ర తాబేలు (జియోచెలోన్ ఎలిగాన్స్) భారత చట్టం ప్రకారం రక్షిత జాతి. ప్రత్యేకంగా ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 యొక్క షెడ్యూల్ IVలో జాబితా చేశారు. ఈ షెడ్యూల్ జాతులకు రక్షణను అందిస్తుంది, ఇందులో వాటి ఆవాసాల రక్షణ కూడా ఉండాలి.

అంతర్జాతీయంగా, భారతీయ నక్షత్ర తాబేలును 2016 నుండి IUCN రెడ్ లిస్ట్ కింద వర్గీకరించారు. ఇది తగ్గుతున్న వాటి సంఖ్యను సూచిస్తుంది. అదనంగా 2019లో అంతరించిపోతున్న జాతుల అడవి జంతువులు, వృక్షజాలం (CITES)లో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ అనుబంధం I లో భాగం అయింది. వాణిజ్యానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ రక్షణ, అత్యున్నత స్థాయిని ప్రతిబింబిస్తుంది.

ఈ అడవిని నాశనం చేస్తే, ఈ జాతులు వాటి సహజ ఆవాసాలను కోల్పోతాయి. మరెక్కడా వెళ్ళలేవు. ఈ పర్యావరణ వ్యవస్థ అంతరాయం మానవ-వన్యప్రాణుల సంఘర్షణ, జీవవైవిధ్యానికి కోలుకోలేని నష్టం వంటి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని ఒక నిపుణుడు చెప్పారు.

వాతావరణం, గాలి నాణ్యత, నీటి భద్రతపై ప్రభావం:

కంచ గచ్చిబౌలి పచ్చదనం హైదరాబాద్‌కు సహజ వాతావరణ నియంత్రకంగా పనిచేస్తుంది. ఈ అడవి పచ్చదనంతో ఊపిరితిత్తుల లాగా పనిచేస్తుంది. పట్టణ ప్రాంతంలో వేడిని తగ్గిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు చల్లదనం అందిస్తుంది. హైదరాబాద్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా ఈ అడవి నాశనం అవుతుంది. స్థానిక వాతావరణ పరిస్థితులను మరింత దిగజార్చుతుంది. వాయు కాలుష్య స్థాయిలను పెంచుతుందని మరొక నిపుణుడు అన్నారు.

గాలి నాణ్యత మెరుగుదల:

చెట్లు సహజ ఎయిర్ ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి, కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. దుమ్ము, పొగ, నైట్రోజన్ ఆక్సైడ్‌, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను బంధిస్తాయి. పచ్చని ప్రదేశాలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, పట్టణ వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి.

వేగవంతమైన పట్టణీకరణ, వాహన ఉద్గారాలతో హైదరాబాద్ ఇప్పటికే క్షీణిస్తున్న గాలి నాణ్యతను ఎదుర్కొంటోంది. ఈ పచ్చదనాన్ని నాశనం చేయడం వల్ల కాలుష్య స్థాయిలు మరింత దిగజారిపోతాయి.

నీటి భద్రత, భూగర్భ జలాల పునరుద్ధరణ:

వర్షపు నీటిని పీల్చుకోవడం, వేగవంతమైన ఉపరితల ప్రవాహాన్ని నిరోధించడం ద్వారా అడవులు నీటిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెట్లు, మొక్కల వేర్లు భూగర్భ జలాల పునరుద్ధరణను సులభతరం చేస్తాయి, హైదరాబాద్ భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి. ఈ అడవిని నాశనం చేయడం వలన భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యం ఆగిపోతుంది. అందువల్ల భూగర్భజల లభ్యత తగ్గుతుంది.

శీతలీకరణ ప్రభావం, వాతావరణ నియంత్రణ:

పట్టణ అడవులు పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాంక్రీట్, తారు, తగ్గిన పచ్చదనం కారణంగా నగరాలు గణనీయంగా వేడిగా మారుతాయి. చెట్ల నీడ, ఆకుల నుండి బాష్పీభవనం ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి, చల్లగా మరింత నివాసయోగ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

400 ఎకరాల దట్టమైన పచ్చదనం కోల్పోవడం వల్ల హైదరాబాద్ వేసవికాలం మరింత కఠినంగా మారుతుంది, ప్రజల్లో ఎండ, వేడి సంబంధిత అనారోగ్యాలు తీవ్రమవుతాయి.

యాజమాన్య హక్కులు, న్యాయ పోరాటాలు:

అసలు యాజమాన్యం (1974):

హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) ను 1974లో స్థాపించారు. విద్యా, పరిశోధన ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నంబర్ 25 కింద 2,300 ఎకరాలను కేటాయించింది. 2000ల ప్రారంభంలో, కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను IMG అకాడమీస్ భారతకు స్పోర్ట్స్ అకాడమీ కోసం ఎకరానికి ₹50,000 (మొత్తం ₹2 కోట్లు) తక్కువ ధరకు తిరిగి కేటాయించారు. ఆ సమయంలో వాస్తవ మార్కెట్ విలువ ₹300 కోట్లకు పైగా ఉంది.

ఒప్పందం ప్రకారం స్పోర్ట్స్ అకాడమీని అభివృద్ధి చేయడంలో IMG విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని వినియోగించకపోవడంతో ఒప్పంద ఉల్లంఘన కారణంగా తిరిగి పొందింది.

చట్టపరమైన పోరాటం & హైకోర్టు తీర్పు (2025):

IMG స్వాధీనాన్ని సవాలు చేసింది. ఇది దీర్ఘకాల చట్టపరమైన వివాదానికి దారితీసింది. 2025లో, తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ, భూమిని ప్రభుత్వం నిలుపుకోవడానికి, వేలం వేయడానికి అనుమతినిచ్చింది.

ప్రభుత్వ వేలం ప్రణాళిక (2025):

TSIIC ఇప్పుడు ఈ భూమిని వాణిజ్య ఉపయోగం కోసం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూమిని మొదట విద్యా, పరిశోధన ఉపయోగం కోసం ఉద్దేశించినప్పటికీ, దాని పర్యావరణ ప్రాముఖ్యతతో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ ఆస్తిగా మార్చనున్నారు. చట్టపరమైన పోరాటంలో ప్రభుత్వం గెలిచింది, కానీ ఈ విజయం జంతువుల ఆవాసాలను తిరిగి పొందలేని విధంగా కోల్పోవడానికి కారణవ్వనుంది.

వాతావరణ పరిణామాలు:

హైదరాబాద్ ఇప్పటికే తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటోంది. 400 ఎకరాల పచ్చదనం కోల్పోవడం వల్ల హీట్ ఐలాండ్ ప్రభావం మరింత దిగజారి, నగరం వేడిగా మారుతుంది. నివాసయోగ్యంగా ఉండదు.

ప్రభుత్వ భూమి ద్వారా అనైతిక డబ్బు ఆర్జన:

ఈ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చడం పర్యావరణ శ్రేయస్సు కంటే ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తుంది.

పోరాటానికి పిలుపు:

కాంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని వేలం వేయడం కేవలం రియల్ ఎస్టేట్ సమస్య కాదు. ఇది హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతపై ప్రత్యక్ష దాడి. ఈ భూమి జీవవైవిధ్యానికి కీలకమైన జోన్, వాతావరణ నియంత్రకం, ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న కొన్ని పట్టణ అడవులలో ఒకటి అని పర్యావరణవేత్తలు అన్నారు.

ఒకసారి నాశనం చేస్తే, ఈ ఆవాసాన్ని పునరుద్ధరించలేము. పౌరులు, పర్యావరణవేత్తలు ఈ వేలాన్ని వ్యతిరేకించాలి. ఈ కీలకమైన పచ్చని ప్రదేశం రక్షణను డిమాండ్ చేయాలని కోరారు. హైదరాబాద్ భవిష్యత్తు స్వల్పకాలిక ఆర్థిక లాభాల కంటే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే స్థిరమైన అభివృద్ధిపై ఆధారపడి ఉండాలని అంటున్నారు.

"ఈ అడవి శాశ్వతంగా నాశనమయ్యే ముందు మనం దానిని కాపాడుకోవాలి. రాష్ట్రం మార్చి 8 నుండి 15, 2025 వరకు బిడ్లను స్వీకరించడం ప్రారంభించే అవకాశం ఉంది. దీని తర్వాత, బిడ్లను ఎంపిక చేసి, రాబోయే 2 నెలల్లో భూమిని ఇచ్చేస్తారు. ఈ సమస్యపై మన ఆందోళనలను లేవనెత్తాల. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వానికి ప్రజలు తెలియజేయాలి" అని ఒక నిపుణుడు అన్నారు.

Next Story