హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ యజమానిపై కేసు నమోదు
Sarvi Hotel Owner booked cook suffers grievous wounds lift accident. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ లో ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2023 3:28 PM GMTబంజారాహిల్స్‌లోని ఓ హోటల్ లో ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో వంట మనిషికి తీవ్ర గాయాలయ్యాయి. యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. లిఫ్టు పనిచేయడం లేదని చెప్పినా పట్టించుకోలేదు. లిఫ్ట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు వై.లక్ష్మణ్ అనే వ్యక్తి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 11న ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.1లో ఉన్న హోటల్ సర్విలో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మణ్ ఉదయం తన విధులకు హాజరవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాలుగో అంతస్థులోని లిఫ్ట్ ఎక్కాలని అనుకున్నాడు. అయితే లిఫ్ట్ ఐదో అంతస్తులో ఉంది. ఆ విషయం తెలియక అందులోకి అడుగు పెట్టాడు. అతను నాల్గవ అంతస్తు నుండి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కు రెండు కాళ్లు విరిగిపోవడమే కాకుండా.. తీవ్ర గాయాలయ్యాయి. అతడు కిందకు పడిపోగా.. అతడి మీదకు లిఫ్ట్ వచ్చి దిగడంతో అతని గాయాలు మరింత తీవ్రతరం అయ్యాయి. లిఫ్ట్ లో సమస్యలు ఉన్నాయని తెలిసినా మరమ్మతులు చేయకుండా వదిలేశారని, హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించాడని లక్ష్మణ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు.
మొదట హోటల్ యజమాని.. లక్ష్మణ్ వైద్య చికిత్సకు పూర్తి బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. అతను కోలుకునే వరకూ అతనికి నెలవారీ కొంత డబ్బును ఇస్తానని చెప్పాడు. యజమాని ఇచ్చిన మాటను నమ్మిన లక్ష్మణ్ ఫిర్యాదు చేయలేదు. అయితే, రెండు నెలల క్రితం నుండి యజమాని లక్ష్మణ్ తో ప్రవర్తించిన తీరు సరిగా లేదు. లక్ష్మణ్ చికిత్సకు సహాయం చేయడం మానేశాడు.. డబ్బుల కోసం హోటల్ దగ్గరకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. హోటల్ యజమాని చేతిలో మోసపోయానని భావించాడు లక్ష్మణ్. తనకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఐపీసీ సెక్షన్ 337, 506 కింద సర్వి హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు.