గంధపు చెట్టును దొంగిలించేశారు.. ఎవరి బంగళా నుండి అంటే?
సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఉంటున్న బంగాళాలో దొంగతనం జరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2023 9:41 PM ISTసికింద్రాబాద్ కంటోన్‌మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఉంటున్న బంగాళాలో దొంగతనం జరిగింది. బంగళా ప్రాంగణంలోని విలువైన గంధపు చెట్టును దొంగలు నరికేసి తీసుకుని వెళ్లిపోయారు. ఈ నెల 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా గంధపు చెట్టును దొంగిలించేశారంటే వాళ్ల ప్లాన్ ఎంత పగడ్బంధీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సీఈవో మధుకర్ నాయక్ నివాసం ఉంటున్న బాలమారిలోని సప్పర్స్ లేన్‌లోని బంగ్లా నంబర్ 150/ఏలో ఈ చోరీ జరిగింది. బంగళా వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ లోపలి చొరబడి దొంగతనం చేశారు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు ఇన్‌చార్జి హార్టికల్చర్ అధికారి ఎ.మహేందర్ చందనం చెట్టు కనిపించడం లేదని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు బంగ్లా చుట్టూ ఉన్న ఇనుప కంచెను కత్తిరించి అనధికారికంగా ప్రవేశించినట్లు నివేదించారు.
దొంగిలించిన గంధపు చెట్టు అరుదైన జాతికి చెందినదని.. దానిని నరికి, ఆవరణ నుండి తీసుకుని వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ దొంగలు చెట్టును ఎంతో సులువుగా తీసుకుని వెళ్లిపోయారు. శుక్రవారం బేగంపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బేగంపేట పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 447, 379 కింద కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బేగంపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ జట్టు భాస్కర్ న్యూస్ మీటర్ కు తెలిపారు.