హైదరాబాద్‌లో కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ..టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
మీరు తినే సమోసాలు శుభ్రంగానే ఉన్నాయా? అయితే జియాగూడలో బయటపడ్డ ఈ దారుణం చదివితే షాక్ అవ్వాల్సిందే
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ..టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
హైదరాబాద్: మీరు తినే సమోసాలు శుభ్రంగానే ఉన్నాయా? అయితే జియాగూడలో బయటపడ్డ ఈ దారుణం చదివితే షాక్ అవ్వాల్సిందే. అపరిశుభ్ర వాతావరణంలో, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ భారీ స్థాయిలో సమోసాలు తయారు చేస్తున్న ఒక అక్రమ యూనిట్‌పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆహార భద్రతా విభాగం (H-FAST) మరియు కుల్సుంపుర పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
భయంకరమైన పరిస్థితులు:
శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఈ యూనిట్‌లో, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేస్తున్నారు. ఒకసారి వాడిన నూనెను పదేపదే మరగబెట్టడం, నాణ్యత లేని పిండి, అంతకంటే దారుణంగా కుళ్లిపోయిన గుడ్లను వాడి సమోసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పదార్థాలు తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
రూ. 5 లక్షల సామాగ్రి సీజ్:
యూనిట్ యజమాని అబ్దుల్ రషీద్ (73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా సుమారు రూ.5 లక్షల విలువైన ఆహార నిల్వలు, వేల సంఖ్యలో తయారు చేసిన సమోసాలు, పాడైపోయిన గుడ్లు మరియు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వంటకు వాడుతున్న పరికరాలను కూడా సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Hyderabad:Hyderabad #TaskForce busted an #illegalsamosa unit in #Jiyaguda, seizing #unhygienicfood stock worth ₹5 lakh. A 73-year-old accused identified as Abdul Rasheed was caught using #spoiledeggs and #reusedoil without #licenses. #Case registered, probe on.… pic.twitter.com/jrntIUj2Bw
— NewsMeter (@NewsMeter_In) March 21, 2026