మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..!
Red Alert in Hyderabad another three days.మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ కొనసాగనుందని
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2021 11:49 AM GMTమరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ కొనసాగనుందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు. క్యూములో నింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నాయన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. మరో గంటలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విరామం లేకుండా 6 నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం 040 – 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంబించింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పోశాయి. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.