హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి పీఎస్ సీఐ నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. సీఐ నాగేశ్వరరావుపై అత్యాచారం, ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయమై రాచకొండ సీపీ నుంచి హైదరాబాద్ సీపీ కార్యాలయానికి సమాచారం అందడంతో నాగేశ్వర్‌రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బోనాలు, బక్రీదు పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీకి మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐ నాగేశ్వరరావుపై బాధితురాలి భర్త దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఐ నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 7న హస్తినాపురం శ్రీవెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి నాగేశ్వరరావు వెళ్లాడు. రాత్రి సమయంలో బాధితురాలి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే వారి ఇంట్లోకి నాగేశ్వరరావును ప్రవేశించారు. భర్త తిరిగొచ్చే వరకు భార్యపై నాగేశ్వరరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన భర్త.. భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భర్తను సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి భార్యభర్తలను కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాడు. అదే సమయంలో కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పీఎస్‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.