ఫిబ్రవరి 1, శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ ఈటరీ ప్లేస్ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడానికి తక్కువ-తీవ్రత కలిగిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED) కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధృవీకరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని స్పష్టం చేశారు.
రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు జరగాలనే ఉద్దేశ్యంతో చేసిన పేలుడు కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని సిద్ధరామయ్య కోరారు. మంగళూరులో బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో చివరి పేలుడు జరిగిందని గుర్తు చేశారు. ఈ పేలుడు కారణంగా తొమ్మిది మంది గాయపడ్డారు. గ్యాస్ లీక్ కారణంగా మొదట ఈ పేలుడు సంభవించిందని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అగ్నిమాపక శాఖ ఆ అవకాశాన్ని తోసిపుచ్చింది. సంఘటన స్థలంలో ఒక బ్యాగ్ కనుగొన్నారు. ఫోరెన్సిక్ బృందాలు పేలుడుకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరు సిబ్బంది, ఏడుగురు కస్టమర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి బాంబు నిర్వీర్య దళం, ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి.