అధిష్టానం షోకాజ్ నోటీస్‌కు రాజాసింగ్ సమాధానం..!

Rajasingh Show Cause Notice. బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహాల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ బ‌హిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

By Medi Samrat  Published on  10 Oct 2022 12:36 PM GMT
అధిష్టానం షోకాజ్ నోటీస్‌కు రాజాసింగ్ సమాధానం..!

బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహాల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ బ‌హిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న పార్టీ నాయ‌క‌త్వం షోకాజు నోటీసు జారీ చేసింది. జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు రాజసింగ్ సతీమణి ఉషా బాయి అప్పట్లో గడువు కోరారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ నేడు సమాధానం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న‌ట్లు రాజాసింగ్ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు పాల్పడలేదని వెల్ల‌డించారు.

పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని.. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి నాకు అవకాశం ఇవ్వండని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే నాపై అక్రమ కేసులు న‌మోద‌య్యాయ‌ని.. ఎంఐఎం, టీఆర్ఎస్ లు కుట్రపూరితంగా నాపై 100కేసులు పెట్టార‌ని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోంది. పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారని.. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు. హిందువులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు.


Next Story