నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదు.. కఠినంగా శిక్షించాలి
Rajasingh on Radisson Blu Pudding and Mink Issue. హైద్రాబాద్ బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం
By Medi Samrat Published on 3 April 2022 12:21 PM GMTహైద్రాబాద్ బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు.
ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిహారిక వ్యవహారంపై నాగబాబు స్పందించారు. 'నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దని నాగబాబు తెలిపారు. పబ్‌లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్‌లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు రాజాసింగ్. ఇది రెండు రోజులు హడావుడి చేసి వదిలేయొద్దని.. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ కు తన మద్దతు ఉంటుందన్నారు రాజాసింగ్. ఏదైనా డ్రగ్స్ వ్యవహారం బయటపడినప్పుడు రెండు రోజులు హడావుడి చేసి తర్వాత వదిలేస్తోందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని రాజాసింగ్ అన్నారు.