గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా రాజా సింగ్ అరెస్టయ్యారు. తన భర్తపై ప్రయోగించిన పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సతీమణి ఉషాబాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈ మేరు ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఈ పిటిషన్ దాఖలైంది. పీడీ యాక్ట్ కింద తన భర్తపై కేసు నమోదు చేస్తోన్న సమయంలో హైదరాబాద్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించారు. ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం దానిపై విచారణ చేపట్టింది రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిణామాలను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని మంగళ్ హాట్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక అంతకు ముందు ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి కూడా లేఖ రాశారు. ఆగస్టు 23న రాజా సింగ్‌ను సస్పెండ్ చేస్తూ.. ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో సమాధానం చెప్పాలని బీజేపీ అధిష్టానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును పెంచాలని ఆమె బీజేపీని కోరారు. రాజా సింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. రాజా సింగ్ జైలులో ఉన్నారని అందుకు సంబంధించి సమయం ఇవ్వాలని కోరారు.