ఈ నెల 17వ తేది నుండి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలిపారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, తగు రీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో వుంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు చెయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని సి.ఎస్. ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.