నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఆనాడు తెలుగు దేశం పార్టీని స్థాపించారని, ఎన్టీఆర్‌తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలకృష్ణ అన్నారు. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద నాన్నకు ఆసక్తి ఉండేది కాదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ముందు.. ఆ తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రజల వద్దకే పాలన తీసుకురావడానికి దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి మార్గదర్శకమన్న బాలకృష్ణ, నటనకు ఆయన నిర్వచమని, నవరసాలకు అలంకారమని కొనియాడారు.