వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాసిన ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి ఒంటి గంటా యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. హైదరాబాద్‌లో నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నరసింహారావు 1948 డిసెంబరు 29న జన్మించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా పేరొందిన నరసింహారావు.. వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాశారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి పుస్తకాలు ప్రజాదారణ పొందాయి. వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసేవారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన కృషి ఎంతో ఉంది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. పాత్రికేయరంగానికి ఆయన మరణం తీరని లోటని పలువురు తెలిపారు.