హైదరాబాద్ అంబర్పేట్ ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంలో పోలీసుల సోదాలు నిర్వహించారు. నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ సోదాలు చేపట్టారు. ప్రింటింగ్ ప్రెస్ లో మావోయిస్ట్ నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవలే మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలలో పోలీసులు 1000 వరకు బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. అడిషనల్ డీసీపీ మురళీధరరావు, మలక్ పేట్ ఏసీపీ వెంకటరమణ, స్థానిక పోలీసులు ఈ సోదాలలో పాల్గొన్నారు.
ఈ విషయమై అడిషనల్ డీసీపీ మురళీధర్ రావు మాట్లాడుతూ.. బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలను సీజ్ చేశామని.. బైండింగ్ చెయ్యని పుస్తక మెటీరియల్ ని కూడా సీజ్ చేశామని తెలిపారు. పుస్తకాల ప్రింటింగ్ కు సంబంధించి ఎలాంటి రిసిప్ట్ లు లేవని.. పుస్తకాలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉందని పేర్కొన్నారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి గత కొంత కాలంగా మావోయిస్టు అనుబంధ సంఘాలకు తోడ్పపడుతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. రామకృష్ణారెడ్డి పిఓడబ్ల్యు నాయకురాలు సంధ్య భర్త. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. చనిపోయిన అమరుడు రామకృష్ణ భార్య శిరీష తన భర్తపై పుస్తకం తీస్తానంటే సరే అని చెప్పామని.. ఆ పుస్తకంలో ఏముందో కూడా మాకు తెలీదని అన్నారు.