అసలే టమాట కొండెక్కి కూర్చుంది.. రోజురోజుకీ టమాటా రేటు పెరిగిపోతూ ఉండడంతో జనాలు టమాటాను వాడాలంటే భయపడిపోతున్నారు. టమాట రేటు వల్ల గతంలో ఎన్నడూ చూడని ఘటనలు చూస్తున్నాం. టమాట దొంగతనాలు, ఇంట్లో గొడవలు, టమాటాలు బౌన్సర్లు పెట్టి అమ్మడం వంటి చాలా సంఘటనలు చూశాం. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. టమాట లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. మాములుగా అయితే ఏదైనా లోడు లారీ బోల్తా పడితే జనాలు గుంపులు, గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూశాం.
కానీ ఇక్కడ మాత్రం పోలీసులు జనం చేతికి టమాటాలు చిక్కకుండా ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ చిత్రమైన ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. టమాటా లోడుతో ఉన్న ఓ లారీ కోలార్ నుండి కలకత్తా కు వెళ్తున్న సమయంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడిపోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.. జనం టమాటాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉన్నదని భావించి టమాట లారీకి భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు వేరే లారీని తీసుకువచ్చి టమాటో లోడును మొత్తం కూడా మరో లారీల్లోకి ఎక్కించారు. అనంతరం ఆ లారీని గమ్యస్థానానికి పంపించివేశారు. టమాటో లారీకి పోలీసులు భారీ సెక్యూరిటీ ఇవ్వడంతో అక్కడున్న గ్రామస్తులు, వాహనదారులు అవాక్కై చూస్తూ ఉండిపోయారు.