సంధ్య థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు.
By Medi Samrat Published on 17 Dec 2024 6:51 PM ISTసంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు మృత్యువుతో పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, హీరో అల్లు అర్జున్ తో కలిపి మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. వారందరిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అల్లు అర్జున్ ని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కానీ బెయిల్ రావడంతో జైలు నుండి విడుదలయ్యారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యానికి షాక్ ఇచ్చారు.
సంధ్య థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక మహిళ మరణానికి దారి తీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులు అడిగారు. పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలను గమనించిన పోలీసులు.. సంధ్య 70MM, సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.. రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2,520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు.. ప్రజలకు దారి చూపడానికి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదర్శించే సరైన సైన్ బోర్డులు లేవు, అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు.. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు..అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ సీటింగ్ ప్లాన్ చేయలేదు. అల్లు అర్జున్ తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.. టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారని.. నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.