నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ రోజు రాత్రి వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు, ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుని పాటిద్దాం..
- న్యూ ఇయర్ వేళ నగరంలో అన్ని రహదారుల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే మొదటిసారికి రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. లేదా రెండేళ్ల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.
- మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా చర్యలు ఉంటాయి. అధిక శబ్దాలతో పాటలు పెట్టినా, వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకున్నా, కారులో ఎక్కువ మంది ఉన్నా, పైభాగంలో కూర్చని ప్రయాణించినా వాహనాలు సీజ్ చేయబడతాయి.
- న్యూ ఇయర్ వేళ.. ట్యాక్సీ, క్యాబ్, ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేసినా, రైడ్ నిరాకరించినా మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 వరకు జరిమానా విధింపు ఉంటుంది. ఒక వేళ రైడ్ రద్దు అయితే.. ఆ వెహికల్ నంబరు, టైమ్, ప్రాంతం వంటి వివరాలతో 94906 17346 కి కంప్లైంట్ ఇవ్వొచ్చు.
- ఇక ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప.. ఇతర వాహనాలకు అనుమతి లేదు. దీంతో పాటు శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్స్, ఫోరం మాల్, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ వంతెనలను మూసివేస్తారు.