HCUలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న భారీ ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు

By -  Knakam Karthik
Published on : 16 Feb 2026 4:39 PM IST

Hyderabad News, laptop theft case, Hyderabad Central University, HYD Police

HCUలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న భారీ ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 60 ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు, చోరీకి ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్‌ (30) ఈ చోరీలకు సూత్రధారి. అతడితో పాటు విద్యార్థులు సాయి చరణ్‌ (19), అశ్విన్‌రావు (19)లను కూడా అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ భద్రతా వ్యవస్థపై ముందస్తు అవగాహన కలిగి ఉన్న నిందితులు అర్ధరాత్రి సమయంలో క్యాంపస్‌లోకి ప్రవేశించి, సిఆర్ రావు AIMCS విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైంది. చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ల విలువ భారీగా ఉంటుందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీలలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టంచేసిందని అధికారులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Next Story