హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ నిర్వహించిన ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జరిగిన భారీ మోసంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులను సీజ్ చేసినట్లు క్రైమ్స్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం అమీన్‌పూర్‌లోని వెంచర్‌కు సంబంధించిన కేసులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అమీన్‌పూర్ ప్రాజెక్టు పేరుతో దాదాపు రూ.800 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసుతో పాటు మొత్తం 64 కేసులపై విచారణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
అన్ని కేసులకు సంబంధించిన చార్జిషీట్లు పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టు అనుమతి లభించిన వెంటనే సీజ్ చేసిన ఆస్తులపై ప్రకటన చేసి, వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా వసూలు చేసిన మొత్తాన్ని నిందితుడు లక్ష్మీనారాయణ పూర్తిగా తన వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించినట్లు తేలిందన్నారు. అంతేకాకుండా, కొంత మొత్తాన్ని విదేశాలకు బదిలీ చేసినట్లు కూడా సమాచారం ఉందని అదనపు సీపీ వెల్లడించారు. సాహితీ ఇన్‌ఫ్రా మోసంతో నష్టపోయిన బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.