ఇంట్లోనే గంజాయి సాగు చేసే కథను తీసుకుని 'మత్తు వదలరా' అనే సినిమాను తీశారు. అలాంటి ఘటనే మరొకటి తెలంగాణలో చోటు చేసుకుంది. పూల కుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచి అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ యాప్రాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాప్రాల్‌లో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో ఏడు పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక యువకులకు ఈ గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా ఇటీవలి కాలంలో గంజాయి అమ్మకం భారీగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నారు.